
అది అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు ఉండాలి
అప్పుడే నేరస్థులు మానవ హక్కుల ఉల్లంఘన మాట ఎత్తరు
రెడ్ నోటీస్ అందుకున్న వాళ్ల పాస్‌పోర్ట్‌లను రద్దుచేయండి
రాష్ట్రాలకు సూచించిన అమిత్ షా
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బడా పారిశ్రామికవేత్తలు సహా ఉగ్రవాదం, డ్రగ్స్, మనీలాండరింగ్‌కు పాల్పడిన వారిని భారత్‌కు రప్పించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
గురువారం ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ‘‘పారిపో యిన నేరస్థులను రప్పించడం: సవాళ్లు, వ్యూహా లు’’అని అంశంపై ఏర్పాటుచేసిన సమావేశాన్ని అమిత్‌షా ప్రారంభించి ప్రారంభోపన్యాసంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు మొదలు ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన వాళ్లు భారతీయ కఠిన న్యాయవ్యవస్థకు భయపడి విదేశాలకు పారిపోయారు.
వీళ్లు భారత ఆర్థికాభివృద్ధి, సార్వభౌమత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యారు. భారతీయ చట్టం ముందు వీళ్లను నిలబెట్టేందుకు మనం నిర్ధయగా నిర్ణయాలు తీసుకోవాలి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి భారతీయ దర్యాప్తు సంస్థల అభ్యర్థనలతో విదేశాల్లో వీళ్లను అక్కడి దర్యాప్తు అధికారులు ఎలాగోలా అరెస్ట్‌చేసినా భారత్‌కు రప్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
భారత్‌కు అప్పగిస్తే అధ్వానంగా నెట్టుకొస్తున్న, చీకటి కొట్టాల్లాంటి జైలు గదుల్లోపడేస్తారని, తమ జీవన, మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందని నేరస్తులు అక్కడి న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. ఇలాంటి వాదన చేసే అవకాశం మనం వాళ్లకు ఎందుకివ్వాలి? ఇకపై ఇలాంటి ఆరోపణలకు చరమగీతం పాడుదాం. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఇలాంటి నేరస్థుల కోసం ప్రత్యేక జైలు సెల్‌ను నిర్మించండి.
ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త జైళ్లను కట్టాలి. దాంతో భారతీయ కారాగారాలు దుర్భర స్థితిలో ఉంటాయనే వాదన అక్కడి న్యాయస్థానాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. ప్రతి రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో జైలు ఉండాల్సిందే’’ అని అమిత్‌షా అన్నారు. మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ సహా ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, డ్రగ్స్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించి భారత్ ఇప్పటికే 338 మంది నేరస్థులను వెనక్కి రప్పించేందుకు శతథా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.
‘‘కొత్త సాంకేతికతతో నేరస్థుల ఆట కట్టించవచ్చు. భారత్ నుంచి పారిపోయిన నేరస్థులపై అంతర్జాతీయంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన వెంటనే వాళ్ల పాస్‌పోర్ట్‌ను రద్దుచేయాలి. అప్పుడు ఆయా నేరస్తుల అంతర్జాతీయ ప్రయాణాలకు అడ్డుకట్ట పడుతుంది’’ అని రాష్ట్రాల పోలీస్ బాస్‌లకు అమిత్ సూచించారు. సదస్సులో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇంటెలిజెన్స్‌బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా తదితరులు సదస్సులో పాల్గొన్నారు.