అరంగేట్రం నుంచి అంతిమ సమయం వరకూ
రాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేక ముద్ర
కో ఆపరేటివ్ షుగర్ బోర్డు సెక్రటరీ నుంచి
డిప్యూటీ సీఎం వరకూ అంచెలంచెలుగా ఎదుగుదల
బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో నడుస్తూనే
తనదైన శైలిలో రాజకీయాల్లో రాణించిన వైనం
రాష్ట్ర ప్రజల గుండెల్లో ‘దాదా(అన్న)గా చిరస్మరణీయ స్థానం
సాక్షి ముంబై: శరద్ పవార్ సోదరుడి కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడిన అజిత్ పవార్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే తనదైన ముద్ర వేసుకున్నారు. 1982లో కోఆపరేటీవ్ చక్కెర ఫ్యాక్టరీ బోర్డుతో కార్యదర్శిగా, కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అలాగే మహావికాస్ ఆఘాడిలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన అజిత్ 2023లో శరద్‌పవార్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీ, శివసేన (శిందే)ల మహాయుతి కూటమిలో చేరారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరకముందే బుధవారం తన స్వంత నియోజకవర్గం బారామతి వద్ద జరిగిన విమానప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన జీవితంలోని విశేషాల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాల వివరాలివీ.. బాల్యం..
రాష్ట్ర ప్రజలంతా దాదా (అన్నా)గా ముద్దుగా పిలుచుకునే అజిత్ పవార్ 1959, జులై 22న అహిల్యనగర్ (అహ్మద్‌నగర్) దేవలాలి ప్రవరాలో జని్మంచారు. ఎన్సీపీ (ఎస్పీ)అ«ధ్యక్షుడు శరద్ పవార్ అన్న, అజిత్ పవార్ తండ్రి అనంత్‌రావ్ పవార్ సినిమా రంగంలో పనిచేసేవారు. పవార్ తాత గోవింద్‌రావ్ పవార్ బారామతి సహకారి వ్యాపారం, ఆయన అమ్మమ్మ, తాతలు వ్యవసాయం చేసేవారు. ఇక అజిత్ పవార్ అన్న శ్రీనివాస్ పవార్ అగ్రికల్చర్, అటోమొబైల్ రంగంలో ఉన్నారు. పెరిగి పెద్దయ్యాక తాను తీసుకునే అనేక కీలక నిర్ణయాల్లో అన్న శ్రీనివాస్ సలహా తీసుకునేవారు అజిత్ పవార్.
విద్యాభ్యాసం
అజిత్ పవార్ బారామతిలోని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైసూ్కల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం కొల్హాపూర్‌లోని శివాజీ విద్యాపీఠం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత మాజీ మంత్రి పద్మసింహ్ పాటిల్ చెల్లెలు సునేత్ర పవార్‌ను వివాహం చేసుకున్నారు. అజిత్ పవార్, సునేత్ర పవార్ దంపతులకు జయ్ పవార్, పార్థ్ పవార్ అనే ఇద్దరు కుమారులున్నారు.
1982లో రాజకీయ రంగ ప్రవేశం..
1982లో సహకార చక్కె కర్మాగారం బోర్డు ఎన్నికల ద్వారా అజిత్ పవార్ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే అంతకన్నా ముందు అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించినట్టు ఓ ఛానెల్ ఇంటర్యూలో ఆయన స్వయంగా పేర్కొన్నారు. సహకార చక్కెర కార్మగారం బోర్డు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన 1991లో పుణే జిల్లా సహకారి బ్యాంకు (పిడిసి) అధ్యక్షునిగా సుమారు 16 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు.
1991లో బారామతి ఎంపీగా ఎన్నిక..
1991లో మొట్టమొదటిసారిగా ఆయన బారామతి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే తన బాబాయి శరద్ పవార్ కోసం అజిత్ పవార్ తన పార్లమెంటు నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. దీంతో ఎంపీగా ఎన్నికైన శరద్ పవార్ దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ. నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి...
1991లో జరిగిన ఉప ఎన్నికల్లో అజిత్‌పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన 1995, 1999, 2004, 2009, 2014, 2019, 2023 వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా రికార్డు..
అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరు సార్లు చేపట్టారు. ఇలా అత్యధికంగా ఉపముఖ్యమంత్రి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2010 నవంబరు 11వ తేదీన మొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 2012, సెపె్టంబరు 25న ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో పృ«థ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం మూడు నెలల కాలవ్యవధిలోనే చవాన్ నేతృత్వంలో మళ్లీ 2012, డిసెంబరు ఏడో తేదీన రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ప్రభుత్వం గడువు ముగిసేవరకు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగారు. అలాగే 2019 నవంబరు 23వ తేదీన మూడోసారి ఆయన చేసిన ప్రమాణ స్వీకారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ప్రమాణ స్వీకారం మూడు రోజుల్లోనే బెడిసి కొట్టింది. ఆ తరువాత ఆయన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో 2019, డిసెంబరు 30న నాలుగోసారి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక అయిదవ సారి 2023 జులైలో, ఆరవసారి 2024, డిసెంబరు అయిదవ తేదీన ఉపముఖ్యమంత్రి పదవులు స్వీకరించారు.
పనితీరు..సమయ పాలనతో ప్రత్యేక గుర్తింపు
అజిత్ పవార్ పనితీరు, సమయపాలనతోపాటు నిర్మొహమాట వైఖరి ఇతర రాజకీయ నేతలకు ఆయన్ను భిన్నంగా నిలిపింది. సాధారణ కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఏ విషయంలోనైనా వేగంగా నిర్ణయం తీసుకోవడం, అది పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోకపోవడం ఆయనకు అలవాటు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి మృతి చెందే రోజు వరకూ ఈ అలవాటును వీడలేదు అజిత్ పవార్.


