అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో శిఖర సమానుడైన చిన్నాన్న శరద్ పవార్ నీడను దాటుకుని అంచెలంచెలుగా ఎదిగిన నేత. నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పు తూ వచ్చారు. ఆయన రాజకీయ అడుగు లన్నీ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సాగుతూ వచ్చాయి. కానీ రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రి కాగలిగినా, ‘సీఎం’ కల మాత్రం నెరవేరకుండానే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
తనకు రాజకీయంగా జన్మనిచ్చిన బారామతి గడ్డ మీదే తుది శ్వాస విడిచారు. కష్టించే స్వభావం అజిత్ సొంతం. ముఖ్యంగా సమయ పాలనకు పెట్టింది పేరు. ఆయన తండ్రి అనంత్‌రావ్ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు అన్న. 22 ఏళ్ల వయసులో చక్కెర సహకార బోర్డు సభ్యునిగా 1982లో అజిత్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కొంతకాలానికే చిన్నాన్న శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేసి అసెంబ్లీకి వెళ్లారు.
ఏకంగా 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్‌ను వీడి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించాక ఆ పార్టీలో అజిత్ కీలక నేతగా ఎదిగారు. సీఎం కావాలన్న తన అభిలాషను ఎప్పుడూ దాచు కోలేదు. పలుమార్లు ఎన్సీపీకి మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కినా కాంగ్రెస్‌కు సీఎం పదవి అప్పగించడాన్ని పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించారు. 2019లోనే చిన్నాన్నతో విభేదించి బీజేపీతో చేతులు కలిపినా ఫడ్నవీస్ సారథ్యంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొద్ది గంటల్లోనే కూలిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరారు. 2022లో మరోసారి శరద్ పవార్‌పై తిరగుబావుటా ఎగరేయడమే గాక ఎన్సీపీని రెండుగా చీల్చారు. బీజేపీతో చేతులు కలిపి అధికార మహాయుతి సంకీర్ణంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు.


