
బర్మింగ్‌హామ్: ఎయిర్ ఇండియా విమానానికి కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పిన ఉదంతం చోటుచేసుకుంది. భారత్‌లోని అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో గాలిలో ఉన్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ కోసం విమానం కిందకు దిగుతున్న సమయంలో దానిలోని అత్యవసర పవర్ యూనిట్ ‘ర్యామ్ ఎయిర్ టర్బైన్’ (ఆర్ఏటీ) ఊహించని రీతిలో తెరుచుకుంది. అయితే, పైలట్లు అప్రమత్తమై ఎంతో చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
Air India spokesperson says, "The operating crew of flight AI117 from Amritsar to Birmingham on 04 October 2025 detected deployment of the Ram Air Turbine (RAT) of the aircraft during its final approach. All electrical and hydraulic parameters were found normal, and the aircraft…
— ANI (@ANI) October 5, 2025
ఏఐ117 విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తున్న తరుణంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులుగానీ, సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళుతున్న ఏఐ117 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టర్బైన్ తెరుచుకున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. అయితే ఆ సమయంలో విమానంలోని ఇతర వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది’ అని పేర్కొంది.
ల్యాండింగ్ అనంతరం విమానంలో నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ అంతరాయం కారణంగా బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ114 విమాన సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొంది. సంస్థకు ప్రయాణికుల భద్రతే ముఖ్యమని ఎయిర్ ఇండియా మరోమారు స్పష్టం చేసింది.