నటి రన్యా రావుకు ఏడాది జైలు  | Kannada Actress Ranya Rao Sentenced To One Year Jail For Gold Smuggling Under COFEPOSA Act | Sakshi
Sakshi News home page

నటి రన్యా రావుకు ఏడాది జైలు 

Jul 18 2025 5:18 AM | Updated on Jul 18 2025 9:04 AM

Actor Ranya Rao jailed for gold smuggling under COFEPOSA Act

మరో ఇద్దరు నిందితులకూ శిక్ష 

బనశంకరి: విదేశాల నుంచి భారత్‌కు బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్‌ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్‌ జైన్‌లకూ శిక్ష పడింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ ఏడాదిలో రన్యా రావు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోర్టు నిరాకరించింది. 

రన్యారావు ఏడాదిపాటు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు సీఓఎఫ్‌ఈపీఓఎస్‌ఏ చట్టం జారీ చేశారు. నటి రన్యారావు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన రూ.12.56 కోట్ల విలువైన 14.2 కేజీల బరువైన బంగారాన్ని దుబాయ్‌ నుంచి స్మగ్లింగ్‌ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో రన్యా రావును డీఆర్‌ఐ అరెస్ట్‌చేసి విచారించింది. నటితోపాటు ఆమె సహచరుడు తరుణ్‌ కొండూరు రాజు, వజ్రాభరణాల వ్యాపారి సాహిల్‌ జైన్‌ ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌లో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. 

రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్‌కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ నుంచి తరుణ్‌తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రూ.2.67 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు నుంచి మొత్తంగా రూ. 17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. రన్యా రావు గత 12 నెలలకాలంలో 27 సార్లు విదేశాలకు వెళ్లిందని, కస్టమ్స్‌ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement