కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శబరిమల అయ్యప్ప దేవాలయంలో గోల్డ్ చోరీ నిందితులని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఈ సారి అధికార మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) కేరళలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టుల ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తిరువనంతపురంలో LDF, UDF ప్రభుత్వాలు ఇంతకాలం చేసిన అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని తెలిపారు.
మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఇటీవల తిరువనంతరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆయన ప్రస్థావించారు. కేరళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అందుకు నిదర్శనం ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమేనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న LDF, UDF కూటములకు ప్రత్యామ్నయంగా బీజేపీ ఎదిగిందన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ "రాబోయే ఎన్నికలు కేరళ స్థితిని గతిని రెండింటిని మారుస్తాయి. ఇప్పటివరకూ మీరు కేరళని రెండువైపుల నుంచే చూశారు. LDF, UDF రెండు కూటములు కేరళని ధ్వంసం చేశాయి. కానీ మూడోవైపు కూడా ఉంది అదే అభివృద్ధి, పరిపాలన అదే బీజేపీ" అని ఆయన అన్నారు. ఇంతకాలం ఈ రెండుకూటములు అవినీతి, లంచగొడితనం చేసి రాష్ట్రాన్ని బాగుపడకుండా చేశాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ "ముస్లీం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్" గా మారిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వికసిత్ కేరళగా మార్చే హామీ తనదని అన్నారు.
LDF, UDF కూటములు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి ఆ రెండింటి పాలన ఒకే విధంగా ఉంటుందన్నారు. ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందని వారికి తెలుసని మారేది ప్రభుత్వమే.. పాలన కాదు ఆ రెండు పార్టీల విధానం ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని అది బీజేపీ పార్టీనేనని మోదీ స్పష్టం చేశారు.
ఇటీవల తిరువనంతపురం ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్భుతమని అక్కడ పాలించడానికి బీజేపీని ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర యువతకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ఇండియా భారీ ఒప్పందాలు చేసుకుంటుందని అందుకే కేరళలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.


