Olympics Effect On Cricket: భారత్‌ మెరుగైన ప్రదర్శన.. క్రికెట్‌పై ఎఫెక్ట్‌?

71 Percent Indian Parents Game If Child Chooses Sports Local Circles Survey Says - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ అనంతరం భారతీయ కుటుంసభ్యుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయంటోంది కమ్యూనిటీ ప్లాట్‌ఫాం ‘లోకల్‌ సర్కిల్స్‌’ సర్వే. అధిక శాతం కుటుంబసభ్యులు తమ పిల్లలు, మనుమలు మనవరాళ్లు ఎవరైనా క్రికెట్‌ కాకుండా ఇతర క్రీడను కెరియర్‌గా ఎంచు కొంటే మద్దతిచ్చి ప్రోత్సహిస్తామని స్పష్టం చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ అనంతరం దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18 వేల మందితో ‘లోకల్‌ సర్కిల్స్‌’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రోలో స్వర్ణం), మీరాబాయి చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం), హాకీ తదితర క్రీడల్లో భారతీయ క్రీడాకారుల రాణించిన నేపథ్యంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న కోణంలో సర్వే నిర్వహించింది.

 71 శాతం కుటుంబ సభ్యులు క్రికెట్‌ కాకుండా ఇతర క్రీడల్లో పిల్లలకు మద్దతిస్తా మని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబసభ్యులు క్రికెట్‌ కాకుండా మరో క్రీడ వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదని, స్థిరమైన ఆదాయం ఉండదని భావిస్తారని... అయితే ఒలింపిక్స్‌ అనంతర సర్వేలో క్రికెట్‌యేతర క్రీడలకు మద్దతు ఉందని తేలిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒలింపిక్స్‌ సమయంలోనే సర్వే నిర్వహించగా.. భారతీయ క్రీడాకారులు పాల్గొన్న క్రీడలను వీక్షించారా అన్న ప్రశ్నకు 51 శాతం అవునని, 47 శాతం మంది కాదని, రెండు శాతం ఎలాంటి అభిప్రాయం చెప్పలేదని సర్వే తెలిపింది. 51 శాతం మందిలో కుటుంబంలో ఎవరో ఒకరు ఒలింపిక్స్‌ వీక్షించారని తెలిపింది. 2016 ఒలింపిక్స్‌ సమయంలో 20 శాతం మందే భారతీయ క్రీడాకారుల పాటవాలను వీక్షించామని చెప్పగా తాజా సర్వేలో రెట్టింపునకు పైగా వీక్షించామని చెప్పడాన్ని బట్టి గణనీయమై స్థాయిలో మార్పులు వస్తున్నట్లుగా సర్వే అభివర్ణించింది.

చిన్నారులు క్రికెట్‌ కాకుండా వేరే క్రీడను కెరియర్‌గా ఎంచుకుంటే మీ వైఖరి ఏంటి అని ప్రశ్నించగా.. 71 శాతం ప్రోత్సహిస్తామని చెప్పగా 19 శాతం మంది క్రికెట్‌కే ఓటు వేశారని, పది శాతం మంది ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18వేల మంది కుటుంబసభ్యులు సర్వేలో పాల్గొన్నట్లు ‘లోకల్‌ సర్కిల్స్‌’ తెలిపింది. వీరిలో 9,256 మంది ఒలింపిక్స్‌ వీక్షించామని చెప్పారని తెలిపింది. 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు పాల్గొన్నారని, టైర్‌–1 జిల్లాల నుంచి 42 శాతం, టైర్‌–2 నుంచి 29 శాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి 29 శాతం మంది పాల్గొన్నారని లోకల్‌ సర్కిల్స్‌ వివరించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top