అంత్యక్రియలకు ముందే అద్భుతం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఒక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయాడనుకున్న 70 ఏళ్ల పెద్దాయన అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే ఊహించని అద్భుతం జరిగింది. పెద్దాయన తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.
ఆశలన్నీ వదిలేసుకున్నాక..
‘నవంబర్ 1న మా తండ్రి మఖన్ లాల్ వైద్య్‌కు బ్రెయిన్ హెమరేజ్ కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాం. మా నాన్నకు ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కానీ కొంత సమయం తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు’.. అని వృద్ధుని కొడుకు సంజయ్ వైద్య్ వివరించారు. ఎన్నాళ్లయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో, ఆయన్ను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. గురువారం ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ తీసేసిన తర్వాత, వృద్ధుని శ్వాస ఆగిపోయి, చనిపోయారని కుటుంబం భావించింది.
ఇంటికి తెచ్చిన అర్ధగంటలో..
‘నేను మా నాన్నగారి మరణ వార్తను, అంత్యక్రియల వివరాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టాం, మా బంధువులు, పరిచయస్తులు ఇంటికి రావడం ప్రారంభించారు’.. అని సంజయ్ వివరించారు. అయితే.. ఆయనను ఇంటికి తీసుకువచ్చిన అర్ధగంటలోనే పెద్దాయన మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించారు!. ఈ సంఘటనను అద్భుతంగా అభివరి్ణంచిన సంజయ్ వైద్య్, తన తండ్రి ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారని చెప్పారు. ‘మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’.. అని చెప్పిన వైద్య్, తన తండ్రి క్షేమంగా ఉన్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


