నెలలు నిండని శిశువులకు వరప్రసాదమే
కొన్నేళ్లలో అందుబాటులోకి
నెలలు నిండకుండానే జననం. నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ సమస్యకు సైంటిస్టులు తాజా వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అదే... కృత్రిమ గర్భాశయం!
37 వారాలు నిండకముందే పుడితే నెల తక్కువ శిశువు అంటారు. అదే 23 నుంచి 27వ వారం మధ్యలోనే, అంటే ఆరు లేదా ఏడు నెలలకే కాన్పు జరిగితే అలాంటి శిశువు బతకడం చాలాసార్లు కష్టమవుతుంది. అంత లేత ఊపిరితిత్తులు బయటి ప్రపంచపు పరిస్థితులను తట్టుకునేందుకు అనువుగా ఉండవు.
మిగతా కీలక శరీరాంగాలదీ అదే పరిస్థితి. ఆస్పత్రుల్లో ఇంక్యూబేటర్లలో ఉంచినా, ఎంత వైద్య చికిత్స అందించినా చాలాసార్లు లాభముండదు. అలాంటి శిశువుల్లో ఎక్కువమంది మృత్యువాత పడుతుంటారు. సైంటిస్టులు రూపొందించిన కృత్రిమ గర్భాశయం ఇందుకు పరిష్కారంగా కనిపిస్తోంది. ఇందులో ఉమ్మ నీటితో సహా అన్నీ అచ్చం అమ్మ గర్భంలో లాంటి పరిస్థితులే ఉండటం విశేషం!
సంక్లిష్టమే
కృత్రిమ గర్భాశయం ఆలోచన వినేందుకు సింపుల్ గానే ఉన్నా దాని రూపకల్పన మాత్రం చాలా సంక్లిష్టం. అది పరిమాణంలో దాదాపు ఇళ్లలో పెట్టుకునే సాధారణ అక్వేరియాల మాదిరిగా ఉంటుంది. సిజేరియన్ ద్వారా పుట్టిన నెలలు నిండని శిశువును వెంటనే ఉమ్మనీటితో నిండిన సంచీలో పెడతారు. అక్కడ శిశువుకు వెచ్చదనంతో పాటు తల్లి గర్భంలోని అన్ని పరిస్థితులూ అమరుతాయి. మరి పుట్టిన క్షణం నుంచీ అతి కీలకంగా మారే శ్వాసక్రియ పరిస్థితి ఏమిటంటారా? దానికీ మార్గం కనిపెట్టారు. బొడ్డుతాడుకు అనుసంధానించి సింథటిక్ ఉమ్మసంచీ ద్వారా శిశువుకు నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉంటుంది.
ఈ కృత్రిమ గర్భాశయంలో అవసరాన్ని బట్టి కొద్ది రోజులు, వారాల నుంచి నెల, ఆపైన కూడా ఉంచే వెసులుబాటు ఉందంటున్నారు దీన్ని రూపొందించిన సైంటిస్టులు. అయితే ఈ కృత్రిమ గర్భాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్ల కన్నా ఎక్కువే పట్టవచ్చట. కానీ ఈ పద్ధతిపై ఇప్పటికే నైతిక తదితర సందేహాలు తలెత్తుతుండటం విశేషం! అవన్నీ తీరి, నెలలు నిండకుండా పుట్టే ప్రతి పాపాయీ బతికి బట్ట కట్టే రోజు వస్తే బాగుంటుంది కదా అన్నది సైంటిస్టుల మాట. –సాక్షి, నేషనల్ డెస్క్


