
70 మందిని కాపాడామన్న సైన్యం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతాల్లో గురువారం మూడో రోజు సహాయక చర్యలు కొనసాగాయి. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 70 మందిని కాపాడామని, మరో 50 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఆర్మీ తెలిపింది. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి, 8 మంది జవాన్లు ఉన్నారంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుబడి పోయిన 65 మందిని హెలికాప్టర్ల ద్వారా మాట్లి పట్టణానికి తరలించామని వివరించింది.
తీవ్రంగా ప్రభావితమైన ధరాలి గ్రామంలో బురద మట్టి, రాళ్ల కింద ఇరుక్కుపోయిన వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాధన సంపత్తిని విమానం ద్వారా తరలించినట్లు తెలిపింది. సహాయక చర్యల్లో ఇంజినీర్లు, వైద్య బృందాలు, నిపుణులతో కూడిన 225 బలగాలతోపాటు రెస్క్యూడాగ్స్ పాల్గొంటున్నాయన్నారు. వాతావరణం మెరుగుపడినట్లయితే పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యాధునిక చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను డెహ్రాడూన్‌లో సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు.