
ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేసిన శుభాంశు
మైక్రోగ్రావిటీలో ‘జీవన వ్యూహాల’పై అధ్యయనం
ఆహారం, ఆరోగ్యం, వ్యోమగాముల రక్షణపై దృష్టి
‘గగన్‌యాన్’కు దారి దీపాలు ఈ ప్రయోగాలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించారు. యాగ్జియం –4 మిషన్‌లో భాగంగా శుభాంశు చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగియటంతో ఇక ఇప్పుడు – ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఈ 18 రోజుల్లోనూ ఆయన జరిపిన 7 ప్రధాన ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ఇవి ఎంతో ఉపయుక్తమైనవి కావటం వలన కూడా ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో వివిధ జీవ, భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయటానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వంటి ప్రసిద్ధ భారతీయ పరిశోధన సంస్థలు రూపొందించిన ఆ ప్రయోగాలు ఏమిటో చూద్దాం.
1 టార్డిగ్రేడ్
ఏంటివి?: టార్డిగ్రేడ్‌లు అంటే నీటి ఎలుగు బంట్లు. ఎనిమిది కాళ్లుండే సూక్ష్మజీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలు, రేడియేషన్ వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా ఎక్కువ కాలం జీవించగలవు.
ఏంటి ఉపయోగం?: టార్డిగ్రేడ్‌లు అంతరిక్షంలో ఎలా మనుగడ సాగిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల అంతరిక్ష కార్యకలాపాల్లో వ్యోమగాముల రక్షణకు కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. శుభాంశు అంతరిక్షంలో భారత జాతి టార్డిగ్రేడ్‌లపై అధ్యయనం చేసి, అవి ఎలా మనుగడ సాగిస్తాయో, పునరుత్పత్తి చేస్తాయో, సూక్ష్మ గురుత్వాకర్షణకు (మైక్రోగ్రావిటీ) ఎలా స్పందిస్తాయో, రోజులు గడుస్తున్నకొద్దీ వాటిలో వచ్చే మార్పులు (ఏజింగ్ ప్యాటర్న్స్) పరిశీలించారు. ఈ అధ్యయనం వల్ల రక్షణ వ్యూహాలే కాకుండా.. అంతరిక్షంలో ఆహారాన్ని, జీవ నమూనాలను ఎలా నిల్వ చేయవచ్చో తెలుస్తుంది.
2 మయోజెనిసిస్
ఏంటిది?: మయోజెనిసిస్ అంటే కండరాల్లోని కణాల అభివృద్ధి/పెరుగుదల. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల కండరాల బరువు తగ్గుతుంటుంది. తద్వారా కండరాలు బలహీనమవుతాయి.
ఏంటి ఉపయోగం?: కండరాల్లో కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణలో అధ్యయనం చేసి అవి ఎలా ప్రవర్తిస్తాయో, వాటిలో వచ్చే మార్పులేమిటో శుభాంశు నిశితంగా పరిశీలించారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో కండరాల్లో కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల వాటి బరువు తగ్గకుండా నివారణోపాయాలను కనిపెట్టటానికి, ఆరోగ్య పరిరక్షణకు ఈ అధ్యయనం తోడ్పడుతుంది.
3 విత్తనాల పెరుగుదల
ఏంటిది?: అంతరిక్షంలోకి శుభాంశు పెసర, మెంతి విత్తనాలు తీసుకెళ్లి ట్రేలలో వాటిని ఉంచారు.
ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురు త్వాకర్షణ ప్రభావం మొలకలపైనా, విత్తనాల పెరుగుదలపైనా ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. అంతరిక్షంలో మొక్కలను పెంచడం వల్ల దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాము లకు స్థిరమైన ఆహార వనరు లభిస్తుంది.
4 సైనోబ్యాక్టీరియా
ఏంటివి?: సైనోబ్యాక్టీరియా అనేవి ఆక్సిజన్‌ను, పోష కాలను ఉత్పత్తి చేయగల సూక్ష్మజీ వులు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై మొట్టమొదట ప్రాణ వాయువును ఉత్పత్తి చేసిన జీవులు ఇవి.
ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సైనో బ్యాక్టీరియా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల కోసం ‘బయో రీజెనరేటివ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ’లను అభివృద్ధి చేయవచ్చు. ఉన్న వనరులను రీ సైకిల్ చేసి ఆక్సిజన్, నీరు, ఆహారం వంటి వనరులను తయారు / ఉత్పత్తి చేయటం ద్వారా అంతరిక్షంలో మానవ మనుగడకు సహాయం చేసే కృత్రిమ వ్యవస్థలే ఈ బయో రీజెనరేటివ్ వ్యవస్థలు. ఇవి పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి.
5 మైక్రో అల్గే
ఏంటివి?: మంచినీరు, సముద్ర పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ, ఏకకణ జల జీవులనే సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) అంటారు. ఇవి పోషకాలను అందించగల ఆహారంగా స్వీకరించతగిన సూక్ష్మజీవులు. అలాగే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమైన బయో ఇంధనంగానూ ఉపయోగపడతాయి.
ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సూక్ష్మ శైవలాలు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవడం, వ్యోమగాములకు స్థిరమైన ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయటం ఈ అధ్యయన లక్ష్యం. అలాగే అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి కూడా ఇది దారి చూపుతుందని భావిస్తున్నారు.
6 పంట విత్తనాలు
ఏంటిది?: ఈ ప్రయోగం ఆహార పంటల విత్తనాలపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిశీలించింది.
ఏంటి ఉపయోగం?: శుభాంశు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పంట విత్తనాల పెరుగుదల, దిగుబడులపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే విధానాలను తెలుసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపకరిస్తాయి.
7 వాయేజర్ డిస్‌ప్లేలు
ఏంటివి?: కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు. ఈ ప్రయోగంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి, వాటి వాడకం వల్ల వ్యోమగాములపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శుభాంశు విశ్లేషించారు.
ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వ్యోమగాముల కళ్లు, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎన్ని గంటల పాటు వాటిని వినియోగించవచ్చు, అంతరిక్ష అవసరాల కోసం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కావాలి.. వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుంది.