
మండీ: హిమాచల్‌లోని మండీలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ)కు చెందిన బస్సు లోయలో పడి, ఐదుగురు మృతిచెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం సర్కాఘాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది.
ఈ దుర్ఘటన హిమాచల్‌లోని మండీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కాఘాట్ సబ్-డివిజన్‌లోని మాసెరాన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌టీసీ బస్సు లోయలో పడిపోవడం హృదయ విదారకమైనదని ఆయన పేర్కొన్నారు.
బాధితులకు వెంటనే వైద్యసాయం అందించాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు. ‘ఈ దుఃఖ సమయంలో, మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని సుఖ్‌విందర్ సింగ్ సుఖు‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం రిలీఫ్ ఆపరేషన్లలో చురుకుగా పాల్గొంది.