నారాయణపేట: గణేశ్ నిమజ్జనం, తాఖీ బాబా దర్గా జాతర ఒకేసారి జరగనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ.. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. శనివారం ముస్లిం మతపెద్దలతో కలిసి తఖీ బాబా దర్గా పరిసర ప్రాంతాలతో పాటు బార్పేట్, గుడ్‌లక్ కమాన్, జామా మసీదు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 24న గణేశ్ నిమజ్జనం, దర్గా జాతరలో కవ్వాలి, గ్యార్మీ, ప్రార్థనలు, గంధం తదితర కార్యక్రమాలు ఒకేసారి జరగనున్నందున ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు ఉత్సవాలను మత సామరస్యానికి ప్రతీకగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని.. వదంతులను నమ్మకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అంతకుముందు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వెంట పట్టణ సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.


