కోయిల్‌సాగర్‌కు 200 క్యూసెక్కుల నీరు మాత్రమే పంపింగ్
● అప్రోచ్ కెనాల్‌లో
పేరుకుపోయిన పూడిక
● సాఫీగా ముందుకు సాగని సాగునీరు
● ఇటీవల రెండో మోటారు
ఆన్‌చేస్తే పగిలిన పైపు
● అధికారుల ముందుచూపు
కొరవడటంతోనే దుస్థితి
–8లో u
మరికల్: ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో కోయిల్‌సాగర్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం కనిపించడం లేదు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 32 అడుగులు కాగా.. ప్రస్తుతం 15 అడుగులకు మాత్రమే నీరు చేరింది. ఐదు రోజుల క్రితం ఉంద్యాల స్టేజీ–1 వద్ద రెండు మోటార్లను ప్రారంభించి.. 630 క్యూసెక్కుల నీటిని పర్దీపూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తీలేర్ స్టేజీ–2కు నీరందాల్సి ఉంది. అయితే పర్దీపూర్ చెరువు నుంచి టన్నెల్ వరకు 10 కి.మీ. అప్రోచ్ కెనాల్ ఉండగా.. 2014లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు పూడికతీతకు నోచుకోలేదు. దీంతో పర్దీపూర్ రిజర్వాయర్ నుంచి తీలేర్ పంపుహౌజ్‌కు వచ్చే నీరు మధ్యలోనే వృథాగా పారుతూ మన్నెవాగులో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తీలేర్ స్టేజీ–2 పంపుహౌజ్ నుంచి కోయిల్‌సాగర్‌కు ఒక మోటారుతోనే 315 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. అందులో 115 క్యూసెక్కుల మేర తూము లు, మోటార్ల ద్వారా పంట పొలాల్లో పారుతోంది. ఇక 200 క్యూసెక్కుల నీరు మాత్రమే కోయిల్‌సాగర్‌లోకి చేరుతోంది.
50వేల ఎకరాల ఆయకట్టు..
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా పాత ఆయకట్టు 12 వేలు, కొత్త ఆయకట్టు 38వేల ఎకరాలకు సాగునీ రు అందించాల్సి ఉంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు నీటి ఎత్తిపోతల ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు పూర్తిస్థాయిలో 50 వేల ఎకరాలకు సా గునీరు అందించిన దాఖలాలు లేవు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోంది.
అప్రోచ్ కెనాల్‌లో పూడికతో..
పర్దీపూర్ రిజర్వాయర్ నుంచి తీలేర్ పంపుహౌజ్ నడుమ ఉన్న 10 కి.మీ. అప్రోచ్ కెనాల్ అస్తవ్యస్తంగా తయారైంది. పూడిక పెరిగి నీరు ముందకు సాగని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా సమస్య మరీ తీవ్రంగా మారింది. ఈ కారణంగానే ఒక మోటారు ద్వారా మాత్రమే నీటి పంపింగ్ చేస్తున్నారు. ఇటీవల రెండో మోటారును 45 నిమిషాలు ఆన్ చేయగా.. నీరు సాఫీగా ముందుకు వెళ్లక మోటారు పైపు పగిలిపోయింది. నీటిపారుదలశాఖ అధికారులు వేసవిలోనే అప్రోచ్ కెనాల్ పూడిక తీసి ఉంటే, పర్దీపూర్ నుంచి రెండు మోటార్ల ద్వారా సరిపడా నీరు వచ్చేవని ఆయకట్టు రైతులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి పూడిక తీయకపోతే ఒక మోటారు నీరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.


