నారాయణపేట ఎడ్యుకేషన్: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని.. రైతులకు బీజేపీ అండగా నిలిచి పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు. సోమవారం నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామ రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద పేరపళ్ల గ్రామంలోనే భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. అధికారులు 30 పర్యాయాలు భూ సర్వే నిర్వహించినా రైతులకు ప్రయోజనం చేకూరలేదన్నారు. సర్వేనం.11, 92, 87లోని భూములను సాగుచేస్తున్న రైతుల వివరాలను అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సుమారు 100 ఎకరాలకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు వస్తున్నాయని.. దీంతో అసలైన రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. సర్వేనం.101 భూముల పరిస్థితి ఏమిటో అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులకు అన్యాయం చేస్తున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పంటనష్ట పరిహారం అందిస్తున్నారని విమర్శించారు. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. అనంతరం జయమ్మ చెరువును పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసులు, కోశాధికారి సిద్ధి వెంకట్రాములు, సాయిబన్న, కిరణ్ పాల్గొన్నారు.


