పీయూ అభివృద్ధికి వేగం
● గ్రామీణ స్థాయి నుంచే
విద్యా ప్రమాణాల పెంపు
● పోటీ ప్రపంచంలో రాణించాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి
● పీయూ నేషనల్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక
సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
● హాజరైన ఎంపీ డీకే అరుణ,
వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్‌తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు.
ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి
భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్‌లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.
పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్‌మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్‌రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


