నారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో ఈ నెల 7, 8న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి 5వ జావెలిన్ అథ్లెటిక్స్–2026 మీట్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటి పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడారు. అండర్–6 విభాగం 60 మీటర్ల పరుగుపందెంలో అశ్రిత్ స్వర్ణం, అండర్–12 స్టాండింగ్ బ్రాడ్‌జంప్‌లో శివరాజు కాంస్యం, అండర్–12 విభాగంలో 60 మీటర్ల పరుగుపందెంలో పార్వతి కాంస్యం, అండర్–18 హెప్టాథ్లాన్‌లో సందీప్ రజతం, వెంకటేష్‌కు కాంస్యం, అండర్–18 షాట్‌ఫుట్‌లో ఆనంద్ కాంస్య పతకాలు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా కోచ్‌లు హారికాదేవి, జగదీష్, సత్యం, రాజేశ్వరిని అసోసియేషన్ తరుఫున అభినందించారు.
ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండి
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.నర్సింహులు ఆరోపించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కోస్గి నుంచి నారాయణపేట వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం ముగిసింది. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పాదయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ధరలు, అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా అపూర్వ ప్రగతి సాధిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నియామకాల ఆలస్యం, పరీక్షల రద్దు, వరుస ప్రశ్నపత్రాల లీకేజీలు యువతను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయన్నారు. పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటేష్, శ్రీనివాస్, సరోజమ్మ, నారాయణమ్మ, నర్సింగమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
శనేశ్వరుడికి
అభిషేక పూజలు
కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని సూచించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.


