నారాయణపేట: వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని.. లేకుండా నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలో సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో నేరాలు జరిగినప్పుడు వాహనాన్ని గుర్తించడం కష్టమవుతుందని, దర్యాప్తులోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అక్షరాలు, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, ఇతర రకాల ప్లేట్లు వినియోగించడం వంటి ఉల్లంఘనలను సహించబోమని స్పష్టం చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెనన్స్, వాహన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ తదితర వాటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు.


