కొత్తపల్లి: కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ వినీత్ సూచించారు. శుక్రవారం మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టి ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. మద్దూరు కేంద్రంగా మూడు పోలీస్‌స్టేషన్ల భవనాలు, సౌకర్యాల కల్పన, సిబ్బంది, అవసరాలు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించే అంశాలపై చర్చించారు. అనంతరం మద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత భవనాన్ని ఎస్పీ పరిశీలించారు. పోలీసుశాఖలో ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్ వెలువడినందున నిరుద్యోగ యువత ఉచితంగా చదువుకొనేందుకు లైబ్రరీతో పాటు పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, రోజువారి వార్తాపత్రికలు అందుబాటులో ఉండేలా స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


