జిల్లాలో లోటు వర్షపాతమే నమోదు
● నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణం
● రెండేళ్లుగా అదే పరిస్థితి
● వానలు కురిసినా..
ముందుకుసాగని పంటల సాగు
కొన్ని మండలాల్లో సాధారణం..
మద్దూర్‌లో సాధారణం కంటే 6 శాతం అధికంగా నమోదై సాధారణ స్థాయికి చేరింది. కృష్ణాలో 2 శాతం, కోస్గిలో 12 శాతం లోటు ఉంది. మక్తల్, కొత్తపల్లి మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం పరిధిలోకి వచ్చాయి.
ధన్వాడలో అత్యధిక లోటు..
ధన్వాడలో 45 శాతం, నారాయణపేటలో 41 శాతం, మరికల్‌లో 40 శాతం, గుండుమాల్‌లో 33 శాతం, నర్వలో 26 శాతం, మాగనూర్‌లో 27 శాతం, దామరగిద్ద, ఊట్కూర్‌లో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రైతులకు కాస్త ఊరట..
జూలై 30న జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో రైతులకు కాస్త ఊరట లభించింది. వర్షాభావంతో మందగించిన వ్యవసాయ పనులకు ఈ వర్షం ఊతమిచ్చింది. అయితే జిల్లాలో నెలకొన్న లోటు పూర్తిగా పుడవాలంటే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు అవసరమని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
ఫ జిల్లాలో చెరువులు, ఇతర నీటి వనరులు మొత్తం 769 ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఏ చెరువుకు 25 శాతం నీరు చేరలేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
నారాయణపేట: అడపాదడపా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు కాస్త ఊరటనిస్తున్నా.. విస్తారంగా కురవకపోవడంతో పంటల సాగు నెమ్మదిగానే సాగుతోంది. నీటివసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేస్తుండగా.. వర్షంపై ఆధారపడిన రైతులు మాత్రం ఆకాశం వైపే చూస్తున్నారు. వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటి వరకు సుమారు 60 వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయినట్లు అంచనా.
జిల్లాలో 23 శాతం లోటే..
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు పూర్తిగా తొలగలేదు. జూలై చివరి వారంలో వరుణుడు కాస్త కరుణించినా.. లోటు మాత్రం కొనసాగుతోంది. జూలై 31 నాటికి 23 శాతం లోటు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 13 మండలాల్లో 9 మండలాల్లో లోటు వర్షపాతం పరిధిలో ఉండగా.. నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
29వ తేదీన అంతంతే..
జూలై 29న జిల్లాలో వర్షపాతం అంతంత మాత్రంగానే నమోదైంది. కృష్ణా మండలంలో 7.4 మి.మీ., కోస్గిలో 6.2 మి.మీ., ఉట్కూర్‌లో 2.5 మి.మీ., నారాయణపేటలో 1.9 మి.మీ. వర్షం కురిసింది. దామరగిద్దలో 0.8 మి.మీ., మద్దూర్, గుండుమల్‌లో 0.5 మి.మీ., మాగనూర్, మక్తల్‌లో 0.3 మి.మీ. నమోదైంది. ధన్వాడ, నర్వ, మరికల్, కొత్తపల్లిలో వర్షపాతం నమోదు కాలేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మంగన్న. నర్వ మండలం పెద్దకడ్మూర్. వరి సాగు చేసేందుకు నారుమడి సిద్ధం చేసుకున్నారు. పొలాన్ని కూడా చదును చేసి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి సాగునీరు ఎప్పుడు వదులుతారా అని ఎదురుచూస్తున్నారు. రోజులు గడిచేకొద్ది నారు ముదిరిపోయే ప్రమాదం ఉందని.. సకాలంలో నీరు అందకపోతే సాగు కాలం కూడా దాటిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.


