నల్లమలకు బుల్లెట్‌ రైల్‌ | - | Sakshi
Sakshi News home page

నల్లమలకు బుల్లెట్‌ రైల్‌

Aug 1 2026 1:07 AM | Updated on Aug 1 2026 1:07 AM

మన్ననూరు మీదుగా హైస్పీడ్‌ రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ ఖరారు

డీపీఆర్‌ రూపకల్పన దిశగా..

శంషాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు..

గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు

సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి

సాకారమైతే పర్యాటకంగా..

అభివృద్ధి పరంగా కీలక ముందడుగు

అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్‌– బెంగళూరు బుల్లెట్‌ రైల్‌ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్‌ రైలులైన్ల అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం శంషాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఆమనగల్‌, మన్ననూర్‌, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ను నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్‌మెంట్‌ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్‌– బెంగుళూరు హైస్పీడ్‌ రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లకు శంషాబాద్‌ ప్రాంతం హబ్‌గా మారనుండటంతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మన్ననూర్‌, సోమశిలలో నల్లమల హైస్పీడ్‌ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు.

పర్యాటకానికి ఊతమిచ్చేలా..

నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్‌మెంట్‌ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ రావిర్యాల– ఆమనగల్‌ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్‌ రైల్వేలైన్‌ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్‌– శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్‌ శంషాబాద్‌, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఆమనగల్‌, మన్ననూర్‌, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్‌ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది.

హైదరాబాద్‌– బెంగళూరు హైస్పీడ్‌ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్‌ రూపకల్పనకు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్‌ రైలు మార్గాన్ని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌కు పంపించి.. అలైన్‌మెంట్‌, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement