నారాయణపేట: సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నకొద్ది సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీ ఐ లావాదేవీలు, సోషల్ మీడియా, ఫేక్‌కాల్స్, లింకుల ద్వారా మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసు లు, కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరాదని హెచ్చరించారు. ఉద్యోగం వచ్చిందని చెప్పే ఫేక్ మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దన్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంతో బ్యాంకు ఖాతాల్లోని నగదు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆన్‌లైన్‌న్ షాపింగ్ చేసేటప్పుడు అధికారిక వెబ్‌సైట్లు, నమ్మకమైన యాప్‌లనే వినియోగించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్‌స్టేషన్‌లో కూడా సమాచారం అందించాలన్నారు. సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, అప్రమత్తతే సైబర్ మోసాలను అడ్డుకునే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.


