– వివరాలు 9లో..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ పరిస్థితులతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దిక్సూచిగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్ సొసైటీ. ఒకవైపు సొంత పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూనే.. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసేలా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమైన గుర్తింపు కలిగి ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా వి ద్యార్థుల సౌకర్యార్థం 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఎంపిక చేసిన మండలాల్లో..
ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని 2008–09 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట కేవలం ఎస్సెస్సీ చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా.. 2011 నుంచి ఇంటర్ చదివే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి పాలమూరులో మొత్తం 104 స్టడీ సెంటర్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. వారంలో మొత్తం వారికి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ ఆదివారం స్టడీ సెంటర్లలో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంది. నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ వంటి కొన్ని అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అందుబాటులో ఉన్న కోర్సులు..
ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివిన వారికి రెగ్యులర్ కోర్సులకు సమానంగా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్‌తో అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ బోధన అంశాలను మూడు గ్రూపులుగా విభజించి బోధిస్తారు. గ్రూప్–ఏలో భాషలు, గ్రూప్–బీలో ప్రధాన అంశాలు, గ్రూప్–సీలో వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. మొదటి రెండింటిని కలిపి కనీసం రెండు సబ్జెక్టుల చొప్పున ఐదింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో కొనసాగిస్తారు. ఇంటర్‌లో గ్రూప్–ఏలో భాషలు, బీలో ఆప్షనల్స్, సీలో వృత్తి విద్యా కోర్సులు ఉండగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్–ఏలో ఇంగ్లిష్‌తోపాటు నచ్చిన ఏదో ఒక భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీలో నచ్చిన ఆప్షనల్స్, వృత్తి విద్య కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ఆన్‌లైన్ విధానంలో WWW.TELANGA NAOPENSCHOOL.ORG వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ వారికి రూ.1,400, మహిళలు ఇతర రిజర్వేషన్ వారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రిజిస్ట్రేషన్‌కు రూ.150 సాధారణంగా చెల్లించాలి. ఇంటర్‌లో పురుషులు జనరల్ వారు రూ.1,500, మిగతా వారికి రూ.1,200తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించిన రశీదు, అడ్మిషన్ ఫాం భర్తీ చేసి స్టడీ సెంటర్‌లో అందజేయాలి. చెల్లించిన ఫీజులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు.
ఉమ్మడి పాలమూరులో 104 స్టడీ సెంటర్లు
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో ఆపేసిన వారికి సదావకాశం
ఇతరత్రా పనులు చేసుకుంటూనే చదివేందుకు అవకాశం
సర్టిఫికెట్‌కు రెగ్యులర్ కోర్సులతోసమాన ప్రాధాన్యం
ఆన్‌లైన్‌లో దరఖాస్తులుచేసుకోవాలంటున్న అధికారులు
అనుమతి వచ్చింది..
డిస్టెన్స్ విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు సూచించిన ఫీజులను చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును.. తమకు అనుకూలమైన సమయంలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆది, రెండో శనివారాల్లో తరగతులు నిర్వహిస్తాం.
– శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్


