నారాయణపేట: నీట్ పేపర్ లీకేజీతో ఎంతోమంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌ను కోల్పోయారని.. మరికొందరు ప్రాణాలు సైతం వదిలారని, పరీక్షల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌్ వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయనను భర్తరఫ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అక్రమాలు, లీకేజీలకు కేంద్రంగా మారడం దురదృష్టకరమన్నారు. ఎన్‌న్‌టీఏను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. వారిపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమని తెలిపారు. విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో రైతుల ఉద్యమం విషయంలోనూ కేంద్రం ఇదేవిధంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, శ్రామికులకు శ్రమకు తగిన వేతనాలు అందడం లేదని ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు మేలు చేసేలా కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉడ్మల్‌గిద్ద గోపాల్, బండమీది బలరాం, అంజిలయ్యగౌడ్, గోవిందరాజు, అశోక్, గుండెగారి దస్తప్ప, నరహరి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


