పనితీరు మెరుగుపడకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

పనితీరు మెరుగుపడకుంటే చర్యలు

Jul 25 2026 12:41 AM | Updated on Jul 25 2026 12:41 AM

నారాయణపేట: మహిళా సంఘాల కార్యకలాపాలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు, బ్యాంక్‌ లింకేజీ, నిధుల సమీకరణ, ఎన్‌పీఏల తగ్గింపు వంటి కీలక సూచికల్లో జిల్లా వెనుకబడటంపై కలెక్టర్‌ ప్రియాంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ ఆధ్వర్యంలో ఏపీఎంలు, సీసీలు, ఎంఎంఎస్‌ఓబీలు, జెడ్‌ఎంఎస్‌ఓబీలతో నిర్వహించిన జిల్లాస్థాయి సోషల్‌ మొబైలైజేషనన్‌ సమీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు కాదు.. ఫలితాలే ప్రామాణికమని, పనితీరు మెరుగుపర్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం రోజుల్లోనే స్పష్టమైన మార్పు కనిపించాలని.. లక్ష్యాలను చేరుకోని ఏపీఎంలు, సీసీలపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి స్థానంలో ఇతరులను ఇనన్‌చార్జీలుగా నియమిస్తామని తేల్చి చెప్పారు. ఐబీ కార్యకలాపాల పనితీరు రాష్ట్రంలో చివరి స్థానంలో ఉండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అర్హులైన వారి జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ఆశించిన స్థాయిలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఒక్కో కమ్యూనిటీ కో–ఆర్డినేటర్‌ (సీసీ) పరిధిలో వాస్తవంగా ఎలాంటి ఫలితాలు వచ్చాయో స్పష్టంగా కనిపించాలన్నారు. పనితీరు నివేదికను వెంటనే ఇవ్వడంతో పాటు 15 రోజుల తర్వాత అదే ఫార్మాట్‌లో పురోగతి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

పర్యవేక్షణ బాధ్యత అధికారులదే..

కిందిస్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును డీఆర్డీఓ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. డీపీఎంలు, ఏపీఎంలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే వారిపైనే ముందుగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై జరిగే ప్రతి సమీక్షకు అధికారులందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కీలక సూచికల్లో పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు కంప్యూటరైజ్డ్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉపాధి నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాకు వచ్చి రెండు నెలలు మాత్రమే అయినప్పటికీ పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఏర్పడిందని తెలిపారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఇప్పటికీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement