మరికల్: పెరిగిన కోడిగుడ్ల ధరలు ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. నెల కిందట గుడ్డు ధర రూ.6.50 ఉండగా.. ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.8, చిల్లరగా రూ.8.50 వరకు పలుకుతోంది. గుత్తేదారులు, ఏజెన్సీలకు మాత్రం ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తోంది. పెరిగిన ధరల ప్రకారం మూడురోజులు గుడ్డు అందించాలంటే ఏజెన్సీలే భారం మోయాల్సి వస్తోంది. కోడిగుడ్డు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
మెనూపై ప్రభావం..
పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల ప్రభావం మధ్యాహ్న భోజనంపై చూపుతున్నాయి. పప్పులు, నూనె, కోడిగుడ్డు తదితరాల ధరలు పెరుగుతుండటంతో నిర్వహణ భారంగా మారుతోంది. పప్పు పలుచగా ఉంటోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు వడ్డించాల్సి ఉండగా ఒకటి రెండుసార్లు ఇస్తున్నారు. వీటికితోడు కూరగాయలతో పాటు ఉల్లి ధర మండుతోంది. వెజ్ బిర్యానీ వండేందుకు పదార్థాల ధరలు సైతం ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో పర్యవేక్షణ లోపంతో ఇష్టారీతిన తయారు చేస్తున్నారు. దీంతో పలువురు విద్యార్థులు భోజనం చేయకుండా ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు.
ఏజెన్సీలకు భారం..
నిబంధన ప్రకారం సోమ, బుధ, శుక్రవారం కచ్చితంగా ఉడకబెట్టిన గుడ్లు విద్యార్థులకు ఇవ్వాలి. కొన్ని పాఠశాల్లలో రెండుసార్లే అందిస్తున్నారు. ఒక గుడ్డు వెంట అదనంగా రూ.3 అదనపు భారం నిర్వహకులపై పడుతోంది. మరికొన్ని పాఠశాల్లలో వారానికి రెండురోజులు కోడిగుడ్డు.. మరోరోజు అరటి పండు ఇస్తున్నారు. ఏజెన్సీలపై భారం పడకుండా, విద్యార్థులు నష్టపోకుండా హెచ్‌ఎంలు నిర్ణయం తీసుకుంటున్నారు.
తరగతుల వారీగా ఇచ్చే బిల్లులు (రూ.లలో..)
6–8
10.17
1–5
6.78
9–10
13.17
● గుడ్డు ఉన్న రోజు
రూ.6 అదనం
సర్కారు ఇచ్చేది రూ.6..మార్కెట్‌లో రూ.8.50
ధరల పెరుగుదలతో నిర్వాహకుల బేజారు
కోడిగుడ్డు స్థానంలో అరటిపండు అందిస్తున్న వైనం


