అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు

Jul 26 2026 3:26 AM | Updated on Jul 26 2026 3:26 AM

నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్‌న్స్‌జెండర్ల సాధికారతశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి రోడ్‌లో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్‌ రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అన్ని తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ అంధత్వం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఒక్కో విద్యార్థికి నాలుగు జతల దుస్తు లు, ప్రభుత్వం కల్పించే ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా సంప్రదించవచ్చని.. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 96182 43794 సంప్రదించాలని సూచించారు.

పచ్చిరొట్టతో భూసారం మెరుగు : డీఏఓ

నారాయణపేట: నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంట దిగుబడులను పెంచేందుకు పచ్చిరొట్ట సాగు ఎంతో ప్రయోజనకరమని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ తెలిపారు. శనివారం మండల కేంద్రం శివారులో రైతు భాస్కర్‌ సాగు చేస్తున్న పచ్చిరొట్ట పంటను ఆయన పరిశీలించి రైతులకు సాగు విధానంపై పలు సూచనలు చేశారు. వరి వేసే రైతులు పచ్చిరొట్టను సాగు చేసి భూమిలో కలియదున్నడంతో భూసారం మెరుగుపడుతుందని తెలిపారు. వరి నాట్లు వేసే సుమారు 40 రోజుల ముందు జీలుగ, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని సూచించారు. పంట పూత దశకు చేరుకున్న సమయంలో కలియ దున్నాలని.. ఇలా చేయడంతో నేలలో నత్రజని, భాస్వరం తదితర పోషకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఫలితంగా రైతులకు ఎకరాకు సుమారు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు పెట్టుబడి వ్యయం తగ్గే అవకాశం ఉందన్నారు.

‘యువత ఐక్య పోరాట ఫలితమే రాజీనామా’

నారాయణపేట: అధికారం ఎంత బలంగా ఉన్నా.. చైతన్యవంతమైన యువత సంకల్పం ముందు తలవంచక తప్పదని జెన్‌జీ ఉద్యమం మరోసారి నిరూపించిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్‌ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే కేంద్రం స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా దేశ యువత పోరాట స్ఫూర్తికి దక్కిన విజయమని అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు తమ భవిష్యత్‌కు, పరీక్షల వ్యవస్థలో పారదర్శకతకు దేశవ్యాప్తంగా ఉద్యమించారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నించినా.. యువత వెనక్కి తగ్గకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కొనసాగించిందన్నారు. సమస్య ప్రారంభమైనప్పుడే ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందిస్తే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదని తెలిపారు. పరీక్షల అవకతవకల కారణంగా భవిష్యత్‌లో ఏ విద్యార్థి నష్టపోకుండా కఠినమైన, పారదర్శకమైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని కోరారు. దేశ యువత సాధించిన ఈ విజయం మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement