పాత పింఛన్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పింఛన్‌ అమలు చేయాలి

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

నారాయణపేట: దశాబ్దాల పాటు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి వృద్ధాప్యంలో కనీస జీవన భద్రత కూడా లేకపోవడం దురదృష్టకరమని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. పాత పింఛన్‌ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్‌తో సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన జన జాగరణ యాత్ర ఆదివారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీగార్డెన్స్‌ వద్ద ప్రారంభమైన బైక్‌ ర్యాలీ అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా వీర సావర్కర్‌ చౌరస్తా వరకు కొనసాగింది. భారీ బైక్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని ‘సీపీఎస్‌ వద్దు–ఓపీఎస్‌ ముద్దు‘, ‘పాత పెన్షన్‌ మా హక్కు‘ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వీరసావర్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నారాయణపేట జిల్లాలో రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయుడు వసంతరావుకు నెలకు రూ.3 వేలలోపే పింఛన్‌ రావడం సీపీఎస్‌ విధానం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణలోనూ పాత పింఛన్‌ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని డీసీసీ మాజీ అధ్యక్షుడు కంభం శివకుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సమస్యను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆగస్టు 23న నిర్వహించే ’చలో హైదరాబాద్‌’ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కృపాకర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మహదేవ్‌, జిల్లా ప్రధానకార్యదర్శి రాఘవేంద్రాచారి, జిల్లా కోశాధికారి సత్యపాల్‌, రాష్ట్ర నాయకులు, టి–జాక్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, తపస్‌ నాయకులు శేర్‌ కృష్ణారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement