నారాయణపేట:మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూ సేకరణలో జాప్యానికి తావులేకుండా సర్వే, పరిహారం, స్వాధీ నం ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దామరగిద్ద మండలం కానుకుర్తి, లక్ష్మీపూర్, పేరపల్లిలో ఇంకా ఎంత మేర భూ సేకరణ మిగిలి ఉందని, సర్వే పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సర్వే పనులను వేగంగా పూర్తిచేసి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వేయర్లు రోజువారీగా ఏ పనులు చేస్తున్నారో నివేదిక సమర్పించాలని సర్వే ల్యాండ్ ఏడీ వేణుగోపాల్‌ను ఆదేశించారు. మిగిలిన భూ సేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రాజెక్టు పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్, ఆర్డీఓ రమేష్, కలెక్టరేట్ ఏఓ అనిల్‌కుమార్, నీటిపారుదలశాఖ ఈఈతో పాటు దామరగిద్ద, మద్దూరు, గుండుమల్ తహసీల్దార్లు పాల్గొన్నారు.
‘సర్’ పరిశీలన..
మండలంలోని జలాల్‌పూర్, పేరపల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ (ఎన్యూమరేషన్) ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. బీఎల్వోలతో మాట్లాడి ఓటరు జాబితాలో ఉన్న డబుల్ ఓట్లు, చనిపోయిన ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనర్హుల పేర్లను శాశ్వతంగా తొలగించి జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి ఇళ్లకు వెళ్లి తీసుకోవాలన్నారు. అలాగే జలాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. బాలామృతం పంపిణీ, గర్భిణుల సంఖ్య, పోషకాహార సేవల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పేరపల్లిలోని పల్లె దవాఖానను తనిఖీ చేసి గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలు, ఎనన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహణ, అవసరమైన మందుల లభ్యతను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెనుక భాగంలో నిర్మాణం పూర్తయిన సబ్‌సెంటర్ భవనం తాళం వేసి ఉండటాన్ని గమనించి జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌కు ఫోన్ చేసి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇంకా చెల్లించలేదని చెప్పడంతో వెంటనే పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఆమె వెంట డీటీ రామకృష్ణ ఉన్నారు.


