దామరగిద్ద: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు బెట్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. బోరుబావుల నీటిని అందించి ఎండకుండా రక్షించుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త డా. సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం సమీపంలో పలువురు రైతుల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెసరకు ఎల్లో మోజాయిక్ (పల్లాకు తెగులు) వైరస్ వ్యాప్తిచెంది పంటలు దెబ్బతింటున్నట్లు గుర్తించామని.. నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పల్లాకు తెగులు సోకిన మొక్కలను మొదటి దశలో ప్రధాన పంట నుంచి తొలగించి కాల్చి వేయాలన్నారు. అజాడిరిక్టిన్ 1500 పీపీఎం 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మూడు రోజుల తర్వాత ఎసిటమాప్రిడ్ 0.3 గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి లేదా ఇమిడాక్లొప్రైడ్ 0.3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలన్నారు. తెగులు ఉధృతి అధికంగా ఉంటే దయాఫెంథిరాన్ 1.25 గ్రామ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఎకరాకు 15 పసుపు మరియు 15 నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకోవాలన్నారు. తెగులును తట్టుకునే రకాలైన ఎల్‌బీజీ 752, ఎల్‌బీజీ 782, పీ యూ–31 రకాలను ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ చందన రైతులు పాల్గొన్నారు.
నానో ఎరువులు వాడాలి..
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ నానో ఎరువుల వినియోగాన్ని పెంచాలని జిల్లా వ్యవసా య అధికారి సక్రియానాయక్ సూచించారు. కోర మండల్ ఇంటర్నేషనల్ కంపెనీ రైతులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన పాల్గొని మాట్లాడారు.


