నేడు హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
రూ.237.71 కోట్లు.. నాలుగు వరుసలు...
మక్తల్ – నారాయణపేట ఆర్‌అండ్‌బీ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రహదారిని ఎలాగైనా తన హయంలో పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సంకల్పించి పనుల ప్రారంభోత్సవానికి పూనుకున్నారు. మక్తల్ నుంచి సింగారం చౌరస్తా వరకు 26 కిలోమీటర్ల రహదారిని రూ.237.71 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రులు పనులు ప్రారంభించనున్నారు.
● నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని పలు రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరికల్– మినాస్‌పూర్–లింగంపల్లి 37.68 కిలోమీటర్ల రహదారికి రూ.49.57 కోట్లు, ఆత్మకూర్–మరికల్ రోడ్ 13.40 కిలోమీటర్లకు రూ.22.47 కోట్లు, మాగనూర్ మండలం నల్లగట్టు–హిందూపూర్ రోడ్డుకు రూ.10.49 కోట్లు కేటాయించగా.. మంత్రులు నేడు పనులు ప్రారంభించనున్నారు.
నారాయణపేట/మక్తల్: జిల్లాలో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి పనుల ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జిల్లాలోని రహదారులను విస్తరించడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతినిస్తూ తొలిసారిగా రహదారులను అభివృద్ధి చేపట్టింది. జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లకు మహర్ధశ అని చెప్పవచ్చు. జిల్లాలో ఇప్పటికే మొదటిదశ టెండర్ ప్రక్రియ పూర్తయింది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు రుణంతో నిర్మిస్తారు. ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో రుణం తిరిగి చెల్లించనుంది. ఈ విధానంలో 15 ఏళ్లపాటు రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌దే. గతేడాది డిసెంబర్ 1న మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.210 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. మంత్రి వాకిటి శ్రీహరి నెలరోజులుగా పట్టుబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నాలుగు లైన్ల రహదారికి నిధులు సరిపోవని అదనంగా మరో రూ.27 కోట్లు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. దీంతో 238 రోజులకు మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి పనుల ప్రారంభానికి సోమవారం మహూర్తం కుదిరింది. పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖమంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకానున్నారు.
హాజరుకానున్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే


