నారాయణపేట: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం, 20 తేదీల్లో జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న 1,81,313 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ దిశానిర్ధేశంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు పాఠశాలలకు వెళ్లని చిన్నారులకు కూడా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు వేయనున్నారు. నులిపురుగులతో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెతుత్తాయి. వీటిని అధిగమించేందుకు ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు వేయడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లక్ష్యాలను నిర్దేశించి మాత్రలు సరఫరా చేశారు.
ఎందుకు ప్రమాదం?
నులిపురుగులు పిల్లల పేగుల్లో పెరిగి వారు తీసుకునే ఆహారంలోని పోషకాలను గ్రహిస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందక రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
వ్యాప్తి ఇలా..
నులిపురుగుల గుడ్లు మట్టిలో ఎక్కువకాలం జీవిస్తాయి. బహిరంగ మలవిసర్జన, అపరిశుభ్ర పరిసరాలు, చెప్పులు లేకుండా తిరగడం, శుభ్రంగా కడగని కూరగాయలు, పండ్లు తినడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వంటి అలవాట్లతో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా చిన్నారులు నేలపై ఆడుకునే సమయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మాత్రలు ఎలా వేస్తారు?
ఆల్బెండజోల్ మాత్రలు వయస్సును బట్టి అందజేస్తారు.1–2 ఏళ్ల పిల్లలకు అర మాత్ర (200 మి.గ్రా.) పొడి చేసి, 2–3 ఏళ్ల వారికి ఒక మాత్ర (400 మి.గ్రా.) పొడి చేసి, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర (400 మి.గ్రా.) నమిలి మింగాలి. సోమవారం తీసుకోలేని వారికి 20వ తేదీన మరో అవకాశం కల్పించారు.
సురక్షితమైన ఔషధం..
ఆల్బెండజోల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారస్ చేసిన సురక్షితమైన నులిపురుగుల నివారణ ఔషధం. ఈ మాత్ర వేసుకోవడంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి మాత్ర తీసుకోవడంతో నులిపురుగుల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చని చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
భోజనం ముందు, మరుగుదొడ్డి తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి, కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి తినాలి, ఎప్పుడూ చెప్పులు ధరించాలి. బహిరంగ మలవిసర్జన చేయరాదు, పిల్లల గోర్లు చిన్నగా కత్తిరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవాలి.
ఇవీ లక్షణాలు..
రక్తహీనత, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, వికారం, అతిసారం, బలహీనత, మలంలో రక్తం పడటం, ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం
1–19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు
జిల్లాలో 1.81 లక్షల మంది
ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ
విధిగా వేయించాలి..
జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ దిశానిర్ధేశంతో జిల్లాలో 1.81 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తప్పనిసరిగా మాత్రలు వేయించాలి.
– డా. సాయిరాం,
జిల్లా ప్రొగ్రామ్ అధికారి


