బంగారు హారం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

బంగారు హారం సమర్పణ

Sep 26 2026 2:08 AM | Updated on Sep 26 2026 2:08 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన పి.సంతోష్‌కుమార్‌ 28 లక్ష్మీ కాసులతో కూడిన బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని ఈఓ చాంబర్‌లో బంగా రు హారాన్ని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం దాతకు తగు రశీదు అందజేసి వేదాశీర్వచనంతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేసి సత్కరించారు.

పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటి విడుదల

జూపాడుబంగ్లా: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గటంతో క్రమేణా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదల తగ్గుతూ వస్తోంది. శుక్రవారం శ్రీశైలం డ్యాంలో 856.20 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 855.20 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం దాదాపు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల కాగా.. శుక్రవారం ఉదయం పోతిరెడ్డిపాడు 2, 4, 5, 7 గేట్లు తెరిచి కేవలం 3 వేల క్యూసెక్కుల నీరు ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి గాలేరునగరి సుజల స్రవంతి కాల్వకు మళ్లించినట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు.

29న రెండో దశసర్టిఫికెట్ల పరిశీలన

నంద్యాల(న్యూటౌన్‌): కేజీబీవీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈనెల 29న స్థానిక డిప్యూ టీ డీఈఓ కార్యాలయంలో రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. నియామక ప్రక్రియల్లో భాగంగా జిల్లా ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా, ఖాళీ వివరాలను సమగ్ర శిక్ష వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వివరించారు. మరింత సమాచారం కోసం డిప్యూటీ డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

గోరుకల్లు ఘటనపై ఎస్పీ దర్యాప్తు

పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్‌ గేటును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తిన ఘటనపై ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జలాశయాన్ని పరిశీలించారు. రిజర్వాయర్‌ గేటు స్విచ్‌ ఆన్‌, ఆఫ్‌ వివరాలు తెలుసుకున్నారు. పాణ్యం పోలీసులు చేపట్టిన దర్యాప్తు విషయాలను తెలుసుకున్నారు. అలాగే ఎస్సార్బీసీ అధికారులతో మాట్లాడారు. విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ఆయన వెంట సీఐ ఈశ్వరయ్య, పాణ్యం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, ఎస్సార్‌బీసీ అధికారులు మనోజ్‌, శిరీష, జయచంద్ర ఉన్నారు.

దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌ ఉద్యోగ అవకాశాలు

కర్నూలు(సెంట్రల్‌): దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌ ఉద్యోగాలకు శనివారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి నైపుణ్యాధికారి దీప్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. 25–42 ఏళ్ల మధ్య వయస్సు భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రాథమిక డ్రైవింగ్‌ నైపుణ్యాలను కలిగి ఉండాలన్నరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. ముందుగా అభ్యర్థులు Naipunyam పోర్టల్‌ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 98665 77369 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement