● కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): ఉమ్మడి జిల్లా నుంచి నంద్యాల జిల్లా పరిషత్ వేరు కావడంతో జిల్లా సమగ్రాభివృద్ధికి మరింత అవకాశం ఏర్పడిందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని మండల రిసోర్స్ సెంటర్ భవనంలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ తొలి ప్రత్యేక అధికారిణిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ వ్యవస్థ ప్రజ లు, ప్రజాప్రతినిధులతో నేరుగా అనుసంధానమై పనిచేసే కీలకమైన వ్యవస్థ అన్నారు. ఈ వ్యవస్థను పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ నుంచి 45 మంది ఉద్యోగులను నూతన నంద్యాల జిల్లా ప్రజా పరిషత్‌కు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఆర్డీఓ విశ్వనాథ్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


