కర్నూలు: మధ్యవర్తిత్వం 3.0లో భాగంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, మీడియేటర్లు, పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారుల మధ్య తలెత్తే వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా మధ్యవర్తులు తమ నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఇరుపక్షాలకు మెరుగైన, నిష్పక్షపాతమైన, మధ్యవర్తిత్వ సేవలను అందించాలని సూచించారు. ప్రతి గ్రామంలో మీడియేషన్‌పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మీడియేటర్లు నిర్మల, లక్ష్మీనారాయణ, అన్నపూర్ణా రెడ్డి, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.


