● బుడ్డాకు మాజీ ఎమ్మెల్యే
శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్
శ్రీశైలంప్రాజెక్ట్: ‘శ్రీశైలంలో మీ అరాచకాలపై నేను చేస్తున్న ఆరోపణలు అన్నీ వాస్తవం. అవసరమైతే మల్లన్న ఎదుట ప్రమాణం కూడా చేస్తాను.. అవన్నీ అవాస్తవాలు అని శివయ్య వద్ద ప్రమాణం చేయగలవా’ అని.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం సున్నిపెంటలోని రెడ్ల కల్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలో ఎమ్మెల్యే తమ్ముడిగా చెప్పుకుంటున్న యుగంధర్‌రెడ్డి దుర్మార్గాలు, అవినీతిపై, అరాచకాలు మితిమీరాయన్నారు. క్రాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగిస్తుండం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారని, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా.. యుగంధర్‌రెడ్డికి కప్పం చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దేవస్థానంలో టెండర్లు జరుగకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. దేవస్థానంలో ఉచితంగా కాటేజీలు కట్టించే దాతలను బెదిరిస్తున్నారని, పీఠాధిపతుల నిర్మాణాలు కూడా కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ. 4 కోట్లతో నిబంధనలకు అనుగుణంగా కాటేజీ నిర్మిస్తున్న తనపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న పత్రికలు, చానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. సున్నిపెంట వాసులకు శాశ్వత అధికారం లేని ఇళ్లపట్టాలు ఇచ్చి మభ్యపెడుతున్నారన్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరుల అరాచకాలు, అవినీతిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు.


