నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించినట్లు డాక్టర్ మధుసూదనరావు, అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ తెలిపారు. వారు గురువారం మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి క్రీడా పోటీల్లో బాక్సింగ్‌లో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు పతకం, నాలుగు రజత పతకాలు సాధించి తృతీయ స్థాయిలో నిలవడం గర్వకారణమన్నారు. నంద్యాల జిల్లాల్లో బాక్సింగ్ శిబిరాలు, రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. క్రీడాకారులు నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బాక్సింగ్ కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని, వివిధ వెయిట్ కేటగిరీల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నాయకులు ఫయాజ్, నూర్‌బాషా, చంద్రశేఖర్, నాగేంద్ర, ఆనంద్, ఉపేంద్ర, గణేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


