బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో మహిళపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వివరాల మేరకు.. గత నెల 31 పాత కక్షల నేపథ్యంలో మినుగ విజయ్, అతని అనుచరులు హసన్, విక్రమ్‌లు షేక్ హుస్సేన్‌బీ ఇంటికి వెళ్లి ఆమె కుమారుడిని చూపించాలంటూ ఆమెతో గొడవపడి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం కర్నూలు రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అనంతరం డోన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ముగ్గురికి రిమాండు విధించినట్లు ఎస్‌ఐ రమేష్ బాబు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాములపాడు: కర్నూలు – ఆత్మకూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లి గ్రామా నికి చెందిన గొల్ల జయకృష్ణ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాల మేరకు.. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం పంచర్ కావడంతో రహదారిపై పక్కకు నిలిపారు. పాములపాడు వైపు నుంచి బైక్‌పై జయ కృష్ణ స్వగ్రామానికి వెళ్తుండగా కంబాలిపల్లి వద్ద అదుపుతప్పి నిలిచి వున్న ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఈ ఘటనపై పాములపాడు ఎస్‌ఐ తిరుపాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మెట్లపై నుంచి పడి..
ఆదోని అర్బన్: పెద్దతుంబలం గ్రామానికి చెందిన రజాక్(35) సోమవారం ఇంట్లో మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు పెద్దతుంబలం ఎస్‌ఐ విద్యశ్రీ తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందరన్నారు. మృతుడి భార్య గౌసియా, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరుకుందలో
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కౌతాళం: ఉరుకుంద గ్రామం ఈరన్నస్వామి దేవాలయ పరిసర ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం కౌతాళంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతునికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. మృతుని గురించి సమాచారం తెలిస్తే కౌతాళం పోలీసులను ఆశ్రయించాలన్నారు.
కర్నూలు(హాస్పిటల్): చిన్న వయస్సులో గర్భం దాల్చడం తల్లీబిడ్డలకు ప్రమాదకరమని రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమ కన్సల్టెంట్ మల్లికార్జున చెప్పారు. సోమవారం కర్నూలు నగరంలోని పెద్దమార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు టీనేజ్ గర్భంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు బాల్యవివాహాల నివారణ, టీనేజీ గర్భదారణ దుష్పరిణామాలు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలకు బలవంతం చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ నిల్వ చేసిన జంక్‌ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.
టార్చ్ లైట్లతో నిరసన
ఆదోని రూరల్: రాత్రి వేళ విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా మండలంలోని పాండవగల్లులో సోమవారం రాత్రి సీపీఎం నాయకులు టార్చ్‌లైట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, మండల కార్యదర్శివర్గ సభ్యులు జె.రామాంజనేయులు మాట్లా డుతూ.. రాత్రి సమయాల్లో అధికారులు విద్యుత్ కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కూలీలు, ప్రజలకు విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు పాండురంగ, అనీఫ్‌బాషా, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, హనుమంతరెడ్డి, కొండయ్య, తాయప్ప, భీమాంజి, నాగరాజు పాల్గొన్నారు.


