నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 27వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్ర మానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు.
తెలంగాణ మరబోట్లు నిలిపివేత
కొత్తపల్లి: తెలంగాణ నుంచి సంగమేశ్వరానికి తిప్పుతున్న మరబోట్లను నిలిపి వేసినట్లు ఎస్‌ఐ జయశేఖర్ ఆదివారం తెలిపారు. తెలంగాణ బోటు నిర్వహకులు నడిపే బోట్లకు లైసెన్స్, సరైన అనుమతి పత్రాలు లేనందున సంగమేశ్వరం వైపు రానివ్వడం లేదన్నారు. అనుమతులు లేకుండా బోట్లు తిప్పితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
పీఆర్‌సీని వెంటనే
నియమించాలి
నంద్యాల(న్యూటౌన్): పీఆర్‌సీని వెంటనే నిమించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య అన్నారు. ఆది వారం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, సరెండర్ లీవులు మంజూరు చేయాలని, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా పునర్విభజన వలన నంద్యాల జిల్లాకు 50 శాతం ఉద్యోగులను కేటాయించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు జాకీర్ హుశేన్,భాస్కర్‌రెడ్డి,శ్రీరాములు వెంకటరామిరెడ్డి, ఆదినారాయణ,రామాంజనేయులు, రఫి పాల్గొన్నారు.
మహానందిలోనేడు శాకంబరీ ఉత్సవం
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో సోమ వారం శాకంబరీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరణ కోసం వినియోగించే ఆకు, కాయగూరలను ఆదివారం తీసుకొచ్చారు. స్థానిక కల్యాణ మండపంలో మహిళా భక్తులు అలంకరణ కోసం దండలు అల్లే కార్యక్రమం చేపట్టారు. ఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వరుసగా మూడు రోజుల పాటు మహానందిలో శాకంబరీ ఉత్సవం ఉంటుందన్నారు. ఉత్సవం సందర్భంగా ప్రతి రోజూ రోజుకు ఒక అలంకరణలో శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఈఓ చెప్పారు.
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్‌లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.


