ఆళ్లగడ్డ: ఇంటి అద్దె.. పిల్లల ఫీజులు.. పాల బిల్లు, డ్యూటీకి వెళ్లేందుకు పెట్రోలు.. నిత్యావసరాలు.. ఇలా ఎన్నో ఖర్చులు. ఒకటో తేదీ వస్తుందంటేనే భయం. ప్రభుత్వ ఉద్యోగులకు అంత ఇబ్బంది ఉండదు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ప్రైవేట్ వేతన జీవుల పరిస్థితి దయనీయం. వచ్చే అరకొర జీతాన్ని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక సతమతవుతుంటారు. ఆ వేతనం కూడా సమయానికి రాకపోతే వారి బాధలు వర్ణనాతీతం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖలో మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు (ఎంపీఈఓలు)గా పనిచేస్తున్న ఉద్యోగుల దుస్థితి ఇది. గత మార్చి 31తో కాంట్రాక్ట్ గడువు ముగిసింది. నేటికీ రెన్యూవల్ చేయలేదు. అయినా జీతాలు ఇవ్వకుండానే వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఎంపీఈఓలు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతకు వీరిని ఉంచుతారా.. ఊడగొడుతారా ! అనే సందిగ్ధం నెలకొంది.
అగమ్యగోచరం
గ్రామాల్లో ఈ– క్రాప్, పొలంబడి, రైతన్న మీకోసం, ఎరువుల పంపిణీ, వివిధ రకాల సర్వేలు చేసి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఎంపీఈఓలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అవసరాన్ని బట్టి తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేదాక విధులు నిర్వహిస్తున్నారు. అయితే జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నాలుగు నెలలుగా రెన్యూవల్ చేయలేదు. దీంతో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, అనుబంధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఎంపీఈఓల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇదేమని నిలదీస్తే ఉన్న ఉద్యోగం పోతుందేమో అని భయం.. ఎక్కడ వేధిస్తారో అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,426 ఎంపీఈఓల జీవనం అగమ్యగోచరంగా మారింది.
జీతం బెత్తడు.. పని బారెడు!
వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను పల్లె ప్రజలకు ఎంపీఈఓల తెలియజేస్తున్నారు. అయితే వారి సమస్యలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులతో సమాన అర్హత కలిగి మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పొలాల వెంట తిరిగి పంటల నమోదు, మట్టి నమూనాల సేకరణ, వివిధ సబ్సిడీ, ప్రభుత్వ పథకాలను రైతులకు తెలియ జేస్తున్నారు. కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ చేస్తున్న ఎంపీఈఓలకు నెలకు కేవలం రూ. 12 వేలు ఇస్తున్నారు. అదే అర్హతతో పాటు వీరికంటే తక్కువ విద్యనభ్యసించిన వారికి సైతం నెలకు రూ. 31 వేల నుంచి రూ. 45 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు. అలవెన్సులు ఇవ్వరు. పదోన్నతులు కల్పించరు. కంటి తుడుపు చర్యగా ఏ, బీ, సీ గ్రేడ్‌లు సాఽధించిన వారికి రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేల వరకు ప్రోత్సాహం ఇస్తున్నారు. డీ కేటగిరీకి ఏమీ ఇవ్వరు. అది వ్యవసాయ శాఖలో మాత్రం కొందరికే ఇస్తుండగా, ఉద్యాన, మత్స్య తదితర శాఖలలో ఒక్కరికి కూడా ఈ పోత్రహం అందించిన దాఖలాలు లేవు. మత్స్య శాఖలో అయితే ఒక్కో ఎంపీఈఓకు పది గ్రామాలకు పైగా కేటాయించారు. వారికి వచ్చే రూ. 12 వేల జీతం చార్జీలకు, పెట్రోలుకు సరిపోవడం లేదు.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
రూ. 35 వేల జీతం ఇవ్వాలి.
శాంక్షన్ పోస్టుగా మార్చాలి.
ఎంప్లాయి హెల్త్ కార్డు ఇవ్వాలి.
ప్రమాద బీమా కల్పించాలి.
విధి నిర్వహణలో మృతి చెందితే
ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్
లీవ్‌లు కేటాయించాలి.
ఈ ఏడాది మార్చి 31తో
ముగిసిన గడువు
నేటికీ రెన్యూవల్‌పై
ప్రకటన చేయని ప్రభుత్వం
అయినా వెట్టి చాకిరీ
చేయించుకుంటున్న వైనం
దుర్భరంగా మారిన
ఎంపీఈఓల జీవితాలు


