లైఫ్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్‌దారులు జీవన ప్రమాణ పత్రాలు(లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలిపారు. కర్నూలు జిల్లాలో 17,440 మంది, నంద్యాల జిల్లాలో 10,925 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలల్లో సమర్పించిన జీవన్ ప్రమాణ్ పత్రాలు చెల్లుబాటు కావన్నారు. ఫిబ్రవరి నెల చివరిలోగా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఏప్రిల్ 1న చెల్లించే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందన్నారు. అనారోగ్యంతో నడువలేని పింఛనుదారులు ఉన్న ట్లు సమాచారం ఇస్తే సంబంధిత సబ్ ట్రెజరీ సిబ్బంది ఇంటివద్దకే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాలు జారీ చేస్తారన్నారు.
పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పీజీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గత నెలలో మూడో సెమిస్టర్ పరీక్షల నిర్వహించామన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ విద్యార్థు లు 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ మహమ్మద్ వాహిద్, ఆర్థిక శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ, వాణిజ్య విభాగం అధ్యాపకులు డాక్టర్ దళవాయి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


