ప్రచారం లేక.. ఆశించిన స్థాయిలో రాక..!
● ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఉచిత స్పర్శదర్శనం ప్రారంభం ● అవగాహన కల్పిచండంలో అధికారుల విఫలం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని చెంచులకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ముందస్తుగా ప్రచారం నిర్వహించకపోవడంతో ఆశించిన స్థాయిలో చెంచులు రాలేకపోయారు. మంగళవారం చెంచు భక్తులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పి.రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేసుకున్న తర్వాత మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. స్థానిక మేకలబండ, ఇతర గూడెలకు చెందిన చెంచు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 500 మందికి పైగా చెంచులు తరలివస్తారని చైర్మన్, అధికారులు అంచనా వేశారు. అయితే సరైన ప్రచారం లేక చెంచులు అశించిన స్థాయిలో రాలేదు. కేవలం 200 మంది వరకు మాత్రమే వచ్చి ఉంటారని సమాచారం. అనంతరం చైర్మన్ పి.రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. శ్రీశైలక్షేత్ర సంస్కృతి సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఉచిత మల్లన్న స్పర్శదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.


