కలవర పెడుతున్న పొగమంచు
● పూత దశలో పప్పుశనగ ● పొగమంచుతో పూత రాలిపోయే అవకాశం ● దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన
కోవెలకుంట్ల: పప్పుశనగ రైతులను సాగు ఆరంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తన సమయంలో మోంథా తుపాన్ వెంటాడుతుండగా ప్రస్తుతం పొగమంచు కలవర పెడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 48,871 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్‌లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్ల మండలంలో 6,950, ఉయ్యాలవాడ మండలంలో 11,076, దొర్నిపాడు మండలంలో 3,011, కొలిమిగుండ్ల మండలంలో 3,820, అవుకు మండలంలో 1,068 హెక్టార్లలో సాగైంది. పస్తుతం ఆయా ప్రాంతాల్లో పైరు పూత దశలో ఉంది. ఈ ఏడాది చలి తీవ్రతకు తోడు ఇటీవల దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం వేళల్లో పంట పొలాలను పొగమంచు కప్పేస్తుండటంతో శనగ రైతులకు శాపంగా మారింది. పూత దశలో పొగమంచు కురుస్తుండటంతో పూత రాలిపోయే ఆస్కారం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరు రెండు నెలల దశలో ఉండగా మరో నెల రోజుల్లో దిగుబడులు చేతికందనున్నాయి. పూత దశలో పొగమంచు కారణంగా పూత రాలిపోతే దిగుబడులపై తీవ్ర ప్రభా వం పడుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. మరో వారం రోజులపాటు పొగమంచు ఇలాగే కొనసాగితే దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు.


