
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
వెలుగోడు: యూరియా కోసం రైతులు రోడ్డెక్కా రు. వెలుగోడు మండల కేంద్రంలో ఆత్మకూరు– నంద్యాల ప్రధాన రహదారిలో రైతులు బైఠాయించి రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆకలి దప్పులు మానుకొని రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదన్నారు. వరినాట్లు వేసి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా యూరియా వేయలేదని, ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌కే, సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్నా ..యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ప్రభుత్వ తీరుతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని పలువురు హెచ్చరించారు.