
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
● వచ్చే నెల 1 నుంచి
తరగతులు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల పక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు ఆన్‌లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఎంఎంఏసీ) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆయా కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లాలో 39 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీలో అడ్మిషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన విద్యార్థులు వారి పరిశీలనకు హెల్పలైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆప్షన్లు మార్చుకునేందుకు 29వ తేదీ అవకాశం ఉంటుంది.
డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఫీజులతో అన్ని రకాల సౌకర్యాలతో డిగ్రీ చదువుకొనే వెసులుబాటు ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలలో తరగతి విద్యాబోధన అన్ని కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్‌లు ఉన్నాయి.
–డాక్టర్ శశికళ, ప్రిన్సిపాల్, నంద్యాల

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్