సీఎం అండతోనే బుడ్డా బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

సీఎం అండతోనే బుడ్డా బరితెగింపు

Aug 23 2025 3:05 AM | Updated on Aug 23 2025 3:05 AM

సీఎం అండతోనే బుడ్డా బరితెగింపు

సీఎం అండతోనే బుడ్డా బరితెగింపు

బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అండతో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి బరితెగించి అధికారులు, ప్రజలను వేధిస్తున్నాడని మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా పాల్గొన్నారు. సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విధుల్లో ఉన్న ఫారెస్ట్‌ సిబ్బందిని కిడ్నాప్‌ చేసి దాడి చేయటం దారుణమన్నారు. అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి తప్ప తాగి శ్రీశైల శిఖరం చెక్‌పోస్ట్‌లో విధుల్లో ఉన్న చెంచు కులానికి చెందిన గురువయ్య, గిరిజన కులానికి చెందిన రాములు నాయక్‌, మైనార్టీ వర్గానికి చెందిన కరిముల్లాను దుర్భాషలాడరన్నారు. అటవీ ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకుని రాత్రంతా శ్రీశైలం మొత్తం కారులో తిప్పి కులం పేరుతో దుర్భాషలాడి మంత్రి గొట్టిపాటి రవికి చెందిన గెస్ట్‌హౌస్‌లో బంధించి దాడి చేయడం ఆటవిక చర్యఅన్నారు. ఇంత జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రికల్లో ఎమ్మెల్యే తీరుపై సీరియస్‌.. ప్రచారం చేసుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంత సీరియస్‌గా సీఎం చర్యలు తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్యేపై కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయ త్నం కేసులు నమోదు చేయించాలి కానీ అన్నీ చిన్నపాటి సెక్షన్‌లు మాత్రమే నమోదు చేయించడం దేనికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించి ధర్మాన్ని కాపాడాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీశైలం నియోజకవర్గంలో నలుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు హత్యకు గురయ్యారన్నారు. ప్రజలు ఇప్పటికే ఎమ్మెల్యేను బూతు రాజా, వసూల్‌ రాజాగా పిలుస్తున్నారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. శ్రీశైలం ఆలయాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

రెడ్‌బుక్‌ పాలనకు ఇదే నిదర్శనం..

రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల మాట వినని అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే బుడ్డా చేసిన దాడినే నిదర్శనమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌పై దాడి చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి వదిలేశారని గుర్తు చేశారు. కనీసం మంత్రి సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడానికి కూడా వెనుకాడుతున్నారంటే ఇది ఎటువంటి ప్రభుత్వమో ప్రజలే తేల్చాలన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఫారెస్ట్‌ అధికారులను కిడ్నాప్‌ చేసి దుర్భాషలాడినా ఆయనపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించి జైలుకు పంపి వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.

అరాచకాలను ప్రజలే అడ్డుకుంటారు

రాష్ట్రంలో టీడీపీ నేతలు సుపరిపాలన అంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాట వినని వారిని టార్గెట్‌ చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్యెల్యే అర్ధరాత్రి అటవీ సిబ్బందిని కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేయడం దారుణమన్నారు. అటవీ సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన ఎమ్మెల్యేనే కిడ్నాప్‌ చేసి వేధించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీడీపీ నేతల అరాచకాలను ప్రజలే అడ్డుకుంటారన్నారు.

అధికారులకే రక్షణ లేదు..

కూటమి ప్రభుత్వంలో ప్రజలతో పాటు అధికారులు, పోలీసులకు కూడా రక్షణ లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో నాయకులు చెప్పిన మాట వినని వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్నా నలుగురు అటవీ ఉద్యోగులను తన కారులో కిడ్నాప్‌ చేసి కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఎమ్మెల్యేనే వారిని కారులో తీసుకెళ్లి గెస్ట్‌హౌస్‌లో బంధించటం సరైంది కాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పోర్టులో రేషన్‌ బియ్యం తరలిస్తున్న షిప్‌ను సీజ్‌ ద షిప్‌ అంటూ డైలాగ్‌లు చెప్పడం కాదని, రేషన్‌ దందా నడుపుతున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు పుష్కలంగా ఎరువులు సరఫరా చేశారని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో కనీసం రైతుకు యూరియా బస్తా దొరకని పరిస్థతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అందిస్తామని నమ్మించిన చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచాడని ఆరోపించారు.

అటవీ అధికారులపై దాడి చేసిన

ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోరా?

గెస్ట్‌హౌస్‌లో బంధించి, కులం పేరుతో

దూషిస్తే తూతూ మంత్రంగా

కేసు నమోదా?

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్‌,

హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి

శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే

శిల్పా చక్రపాణిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement