
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
నంద్యాల: గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలపవచ్చన్నారు. విధినిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి
గోస్పాడు: ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, ఔషధ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి అన్నారు. నంద్యాల పట్టణంలోని తేజస్వి హోటల్‌లో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు హనుమ న్న, జయరాముడు ఆధ్వర్యంలో నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై శుక్రవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్‌ను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకే విక్రయించాలన్నారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొనుగోలు, అమ్మకాలపై దుకాణ యజమానులు రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, మెడికల్ ఏజెన్సీల సంఘం నాయకులు బొబ్బిటి దామోదర్ రెడ్డి, మెడికల్ షాపుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల
● 24 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ మెరిట్ జాబితాలను శుక్రవారం విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీ చేసి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 53,733 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణ గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజులపాటు నిర్వహించడంతో అభ్యర్థులకు అనేక అనుమానాలు తలెత్తి ఆందోళనతో నెల రోజులుగా తృతీయ ఫలితాలకు మెరిట్ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. న్యాయస్థానాలు కల్పించుకొని డీఎస్సీ మెరిట్ జాబితాలపై ఇచ్చిన ఆదేశాల మేరకు మెరిట్ జాబితాలను విడుదల చేసింది. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు ఒక్కో పోస్టుకు ఒక్కరిని ఎంపిక చేసి మొదటగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అభ్యర్థులు మెరిట్ జాబితా విడుదల చేయకుండా సర్టిఫికెట్ల పరిచశీన ఎలా చేస్తారో అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల కోర్టు తీర్పుతో ఎట్టకేలకు మెరిట్ జాబితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 24 నుంచి టీచర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నారు. ఇందుకు జిల్లాలో మూడు కేంద్రాలను ఎంపిక చేశారు. రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బీఈడి కాలేజీ, రాఘవేంద్ర బీఈడి కాలేజీల్లో సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు 60 కమిటీలను ఏర్పాటు చేశారు.