
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
నంద్యాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీల గ్రామాల వివరాలు సేకరించి అక్కడ జరుగుతున్న అన్యాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించి దళితులకు ఎక్కడా అన్యాయం చోటు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా అధికారులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, డీఎస్పీలు, డీవీఎంసీ సభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.