నీళ్లిచ్చి పంటలను కాపాడండి
శిరివెళ్ల: రబీలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆందోళన బాట పట్టారు. ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలంటూ మంగళవారం శిరివెళ్ల, యర్రగుంట్ల, కోటపాడు, గోవిందపల్లె, కామినేనిపల్లె, వెంకటాపురం రైతులు కేసీ కెనాల్ వద్ద ధర్నా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేసీలో నీరు పుష్కలంగా ఉన్నా మార్చి మొదటి వారం నుంచి నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఈ క్రమంలో వారబందీ క్రమంలో పొలాలకు నీటిని విడుదల చేసేలా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 16వ లాక్ కింద పొలాలకు ఐదు రోజులు, 17, 18, 19 లాక్ కింది పొలాలకు ఐదు రోజుల మేర వంతులను నిర్ణయించి నీటిని వదిలారు. 16వ లాక్ కింద పొలాలకు ఈ నెల 18వ తేదీ వరకు నీరు ఇచ్చారు. తర్వాత 23వ తేదీ వరకు కింది లాక్‌ల పొలాలకు వంతుల మేరకు నీరు ఇచ్చారు. అయితే 24వ తేదీ నుంచి 16 లాక్ పొలాలలకు నీరు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం మధ్నాహ్నం ఒంటి గంట తర్వాత శిరివెళ్ల, యర్రగుంట్ల, గోవిందపల్లె సబ్ చానళ్లకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. దీంతో రైతులు ఆగ్రహంతో ప్రధాన కాల్వ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఒప్పందం ప్రకారం ఈనెల 30వ తేదీ వరకు నీటిని ఇవ్వక పోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వెంకటాపురానికి చెందిన రైతులు తిరుపతిరెడ్డి, గోవిందపల్లెకు చెందిన శ్రీనివాసులు, నాగరాజు, సుబ్బారెడ్డి, నరసింహులు, వీరారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖరరెడ్డి, వజ్రాల వేణుగోపాలరెడ్డి, మహేశ్వరరెడ్డి, కోటపాడుకు చెందిన చిలకల బిజ్జి తిమ్మయ్య, వెంకట సుబ్బయ్య, సూర్య నారాయణరెడ్డి, కామినేపల్లెకు చెందిన ఈశ్వర్, లక్కా పౌల్, సాలరాజు పాల్గొన్నారు.
కేసీ కెనాల్ 16వ లాక్ వద్ద
రైతుల ఆందోళన
అధికారులు మాట తప్పారని
మండిపాటు


