జనవరి 2 నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): రీసర్వే జరిగిన గ్రామాలకు సంబంధించిన రైతులకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో నిర్దేశించిన రోజున రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారని పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కు ఇచ్చి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవాలని రైతులకు సూచించారు. కాగా, గ్రామసభల నిర్వహణ సమాచారాన్ని ముందుగానే రెవెన్యూ అధికారులు తెలియజేస్తారని, ఆ రోజున వెళ్లితే సరిపోతుందని ఆమె సూచించారు.
కాలువలో జారి పడి చిన్నారి మృతి
బండిఆత్మకూరు: కాలువలో పడి అజహా సిద్ధిఖి(4) అనే చిన్నారి మృతి చెందారు. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వలి, మాలన్‌బీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె అయిన సిద్ధిఖా బుధవారం సాయంత్రం తన నానమ్మతో పాటు అంగడికి వెళ్లింది. తిరిగి వస్తూ తండ్రి వద్దకు వెళ్తానని చెప్పడంతో నానమ్మ సరే అని ఇంటికి వెళ్లింది. తండ్రి వద్దకు వెళ్లే క్రమంలో కాలువలో జారి పడి చిన్నారి నీటిలో కొట్టుకుని పోయింది. ఇంటి వద్ద చిన్నారి కనిపించకపోవడంతో కాలువ వెంట గాలించగా మృతదేహం కనిపించింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్త కారుపై దాడి
డోన్ టౌన్: పట్టణంలోని పాతపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజా కారు అద్దాలను గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రాళ్లతో బుధవారం అర్ధరాత్రి పగులగొట్టారు. స్థానికులు గమనించడంతో ‘చంపుతాం’ అని గట్టిగా కేకలువేస్తూ బైకులపై పరారయ్యారు. ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉండవచ్చు అని బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు దాడులు చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కేసీ కెనాల్‌కు
త్వరలో నీరు బంద్
జూపాడుబంగ్లా: హొస్పేట్‌లోని తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు సాగునీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో మరో పక్షం రోజుల్లో కేసీ కాల్వకు సాగునీటి సరఫరా బంద్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,500 క్యూసెక్కుల సాగునీటి సరఫరా కొనసాగుతున్నట్లు కాల్వ పర్యవేక్షణాధికారులు పేర్కొంటున్నారు. సుంకేసుల డ్యాం నుంచి 2,550 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ గురువారం తెలిపారు. లాకిన్స్‌లా వరకు 2,060 క్యూసెక్కుల నీరు చేరుతుందన్నారు. ఈ నీటిని నిప్పులవాగుకు 1,350 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్‌చానల్ కాల్వకు 655 క్యూసెక్కులు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వకు 55 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
ఎస్‌ఐలకు స్థానచలనం
బొమ్మలసత్రం: నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ గురువారం ఎస్పీ సునీల్‌షెరాన్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల వీఆర్‌లో ఉన్న ధనుంజయులును రేవనూరు పోలీసు స్టేషన్‌కు, రేవనూరులో విధులు నిర్వహిస్తున్న భూపాలుడును నందివర్గానికి, అక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటసుబ్బయ్యను నంద్యాల సీసీఎస్‌కు బదిలీ చేశారు. బ్రాహ్మణకొట్కూరులో విధులు నిర్వహిస్తున్న తిరుపాల్‌ను పాములపాడుకు, అవుకులో విధులు నిర్వహిస్తున్న రాజారెడ్డిని నంద్యాల త్రీటౌన్‌కు, అలాగే వీఆర్‌లో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని నంద్యాల వన్‌టౌన్‌కు, నాగరాజును మహిళా పీఎస్‌కు, దాదాపీర్‌ను నంద్యాల డీఎస్‌బీకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 2 నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
జనవరి 2 నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ


